
అమరావతి, 22 డిసెంబర్ (హి.స.)
బోధన్ గ్రామీణం, : బోధన్ పట్టణంలో భారీ చోరీ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ముఖాలకు మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దుకాణాల షట్టర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటన పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సి రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గల రెండు వేర్వేరు బంగారు దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నెంబరు ప్లేటు సరిగా కన్పించని ద్విచక్రవాహనంపై దుకాణం వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తొలుత శివరాజ్‌కు చెందిన దుకాణం షట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. డిస్‌ప్లేలో ఉన్న 30 తులాల బంగారం, ఐదు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం సమీపంలోని గంగాధర్‌కు చెందిన మరో దుకాణ షట్టర్ తాళాలు పగులగొట్టి అందులోకి వెళ్లి 3 తులాల బంగారం, 2 కిలోల వెండి వస్తువులను బ్యాగుల్లో సర్దుకుని మహారాష్ట్ర వైపునకు పారిపోయారు. దొంగలు గంటలోపే చోరీ చేసి పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఏసీపీ శ్రీనివాస్, గ్రామీణ సీఐ విజయ్‌బాబు, ఎస్సై మజోన్‌లు ఘటనాస్థలానికి చేరుకుని దుకాణ యజమానులతో మాట్లాడి వివరాలు సేకరించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇందుకోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి దొంగల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ