
ఢిల్లీ,22డిసెంబర్ (హి.స.)
స్టార్ట్-అప్ వీసా ప్రోగ్రామ్‌ను కెనడా నిలిపివేసింది (Canada ends SUV). ఆ స్థానంలో తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2026లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొత్త స్కీమ్‌ను తీసుకురానున్నట్లు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా(IRCC) అధికారులు వెల్లడించారు. కెనడాలోని వ్యాపార ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్‌లను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్న క్రమంలో స్టార్ట్-అప్ వీసా (SUV) వర్క్ పర్మిట్ల దరఖాస్తులను నిలిపివేసినట్లు తెలిపారు.
దీంతో ఇకపై స్టార్టప్ వీసా ప్రోగ్రామ్ (Start-up Visa program)లో వర్క్ పర్మిట్ కోసం చేసుకునే దరఖాస్తులను అంగీకరించబోమని ఐఆర్‌సీసీ ప్రకటించింది. అయితే ఈ వీసా ప్రోగ్రామ్ కింద ఇప్పటికే వర్క్ పర్మిట్ పొందినవారు దానిని పొడిగించుకోవడానికి చేసుకున్న దరఖాస్తులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. తాము తీసుకువచ్చే కొత్త ప్రోగ్రామ్ కెనడా (Canada) దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని.. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ