
ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) : ఉత్తరాదిలోని అత్యధిక ప్రదేశాల్లో సోమవారం తీవ్ర శీతల పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రత సాధారణం కన్నా కిందికి జారిపోయింది. దేశ రాజధాని దిల్లీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకొని జనసామాన్యానికి ఇబ్బందులు సృష్టించింది. దిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 16 నుంచి 18 డిగ్రీల మధ్యన, అత్యల్ప ఉష్ణోగ్రత 8 నుంచి 11 డిగ్రీల మధ్యన నమోదైందని వాతావరణ శాఖ తెలియజేసింది. పాలం ప్రాంతంలో ఉదయం 8 గంటలకు దట్టమైన పొగమంచు కారణంగా 150 మీటర్ల మేరకు మాత్రమే చూడగలిగే పరిస్థితి నెలకొంది. ఉదయం 9.30 గంటలకు పరిస్థితి మెరుగుపడి 400 మీటర్ల వరకూ చూసేందుకు వీలు కలిగింది. ఈనెల 25న క్రిస్మస్ నాడు దిల్లీలో దాదాపు సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హరియాణాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కొంత ఎక్కువగానే ఉన్నా వాతావరణం అతిశీతలంగా ఉంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ