
మైదుగురి, 25 డిసెంబర్ (హి.స.)
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రక్తపాతం సృష్టించారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని గంబోరు మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ రద్దీ మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సాయంత్రం వేళ పెద్ద సంఖ్యలో ముస్లింలు మసీదులో ప్రార్థనల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి మసీదు లోపలి భాగాలు శిథిలమై భక్తులపై పడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడ హాహాకారాలు నెలకొన్నాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటన ఆత్మాహుతి దాడిగా ఉండొచ్చని లేదా ముందుగానే మసీదు లోపల బాంబు అమర్చి పేల్చి ఉండవచ్చని స్థానిక మిలీషియా నాయకులు అనుమానిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు