
తిరుపతి, 26 డిసెంబర్ (హి.స.)
నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో ఐటీ, టెలివిజన్ రంగాల్లో పెట్టబడులు సరళీకరణ చేశామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) అన్నారు. తిరుపతిలో సంస్కృత యూనివర్సిటీలో జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ (Bharatiya Vignan Sammelan) లకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 81వ ర్యాంకు నుంచి 38వ ర్యాంక్ కు చేరుకుందన్నారు. దశాబ్ద కాలంగా స్టార్టప్ రంగంలో భారత్ దూసుకుపోతోందని పేర్కొన్నారు. స్పేస్ ఎకానమీలో 8వ స్థానానికి చేరుకున్నామని వివరించారు. చంద్రుడిపై ప్రయోగాల్లో కూడా భారత్ ఘన విజయాలు సాధించిందని తెలియజేశారు.
గత దశాబ్ద కాలంలో భారత్ రక్షణ రంగ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీ ద్వారా తన సత్తా చాటిందన్నారు. భారత బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉందన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్లు అత్యధికంగా ఎగుమతి చేసిన దేశంగా భారత్ నిలవడం గర్వకారణమన్నారు. ప్రపంచ దేశాలకు ఆపన్న హస్తం అందించి ఆదుకునే అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి అన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా దేశం పురోగతిని సాధిస్తోందని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో ఉందన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా అంతరిక్ష రంగంలో సైతం ప్రైవేటు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కీలక ఖనిజాలను తవ్వితీసే విషయంలో కూడా ప్రైవేటు సంస్థలను కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV