
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)
పాకిస్తాన్ అణు పరీక్షలపై 20 ఏళ్ల క్రితమే యూఎస్, రష్యా ప్రభుత్వాలు అంతర్గతంగా చర్చించుకున్న విషయాలు తాజాగా డీక్లాసిఫై చేసిన అమెరికా భద్రతా పత్రాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ అంతర్జాతీయ వేదికలపై పదే పదే హెచ్చరించిన అంశాలనే ఈ పత్రాలు బలపరుస్తున్నాయి. ఈ వారం National Security Archive విడుదల చేసిన ట్రాన్స్క్రిప్ట్‌ల ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ 2001 నుంచి 2008 మధ్య జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాల్లో పాకిస్తాన్ అణు ఆయుధాల స్థిరత్వం, భద్రత, అణు పాలసీపై ప్రధానంగా చర్చించారు.
అయితే, 2001 జూన్ 16వ తేదీన స్లోవేనియాలో జరిగిన తొలి భేటీలోనే ఇరాన్, ఉత్తర కొరియా, NATO విస్తరణ లాంటి అంశాలతో పాటు పాకిస్తాన్‌పై తన అనుమానాలను పుతిన్ వెల్లడిస్తూ, “పాకిస్తాన్ అణు ఆయుధాలు కలిగిన మిలిటరీ జుంటా.. అది ప్రజాస్వామ్యం కాదు.. అయినా పశ్చిమ దేశాలను విమర్శించడం లేదని బుష్‌తో అన్నట్లు ఆ పత్రాల్లో ఉంది. ఇక, 2005లో Oval Officeలో జరిగిన సమావేశంలో పుతిన్ మరో కీలక విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్ సెంట్రిఫ్యూజ్‌లలో లభించిన యురేనియం పాకిస్తాన్ మూలం నుంచి వచ్చిందని చెప్పారు. దీనిపై బుష్ స్పందిస్తూ, ఇది అణు నిబంధనల ఉల్లంఘనే.. ఇది మాకు నర్వస్‌గా ఉందని వ్యాఖ్యానించగా, పుతిన్ స్పందిస్తూ.. మా పరిస్థితి కూడా ఆలోచించండి.. అణు లీకేజీ ప్రభావాలు చాలా పెద్దవి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ