
ఢిల్లీ27,డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ పోలీసులకు అమెరికన్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ కృతజ్ఞతలు
క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్‌బేస్‌పై జరిగిన హ్యాకింగ్ ఘటనలో నిందితుడు భారత్‌లో అరెస్టు కావడంతో ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఈ ఏడాది ప్రారంభంలో క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్‌బేస్‌పై సైబర్‌దాడి జరిగింది. కస్టమర్ల డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లు యూఎస్ వెలుపల ఉన్న సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు లంచం ఇచ్చారని ఆ సమయంలో కాయిన్‌బేస్ వెల్లడించింది. హ్యాకర్లు 20 మిలియన్ల డాలర్లు డిమాండ్ చేశారని పేర్కొంది. ఈ హ్యాకింగ్ వల్ల సంస్థకు 400 మిలియన్ డాలర్లు నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘బాధ్యులకు కఠినశిక్ష పడేలా దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తాం. హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వబోం. ఈ ఘటన వల్ల కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మోసపోయిన వారికి పరిహారం చెల్లిస్తాం’’ అని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఓ మాజీ ఏజెంట్‌ను అరెస్టు చేశారు. ‘‘హైదాబాద్ పోలీసులకు ధన్యవాదాలు. హ్యాకర్లకు సహకరించిన మిగతావారికి ఇదే పరిస్థితి రానుంది’’ అని సీఈఓ (American CEO Brian Armstrong) ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ