
ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) మారియెట్టా: భారత్ 80 సైనిక రవాణా విమానాల కొనుగోలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అమెరికాకు ఏరోస్పేస్ దిగ్గజ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్.. తమ సి-130జె సూపర్ హెర్క్యులెస్ విమానాలను బరిలోకి దించింది. భారత్‌కు ఇవి అత్యంత అనువైనవని పేర్కొంది. ఈ కాంట్రాక్టుకు తమను ఎంపిక చేస్తే.. భారత్‌లో ఈ విమానాల ఉత్పత్తికి ఒక మెగాహబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అక్కడి నుంచి విదేశాలకూ ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని వివరించింది. అమెరికా వెలుపల ఇలాంటి కర్మాగారాన్ని తమ సంస్థ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని తెలిపింది. సి-130జె విమానాలు ఇప్పటికే 23 దేశాలకు సేవలు అందిస్తున్నాయని పేర్కొంది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే ఈ రకం లోహవిహంగాలు 12 ఉన్నాయని గుర్తుచేసింది. క్వాడ్ కూటమిలోని ఆస్ట్రేలియా, జపాన్‌లు ఆధునిక సి-130జెలను సమకూర్చుకుంటోందని లాక్‌హీడ్ మార్టిన్ ఉన్నతాధికారి రాబర్ట్ టాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ తరగతికి చెందిన మరిన్ని విమానాలను సమకూర్చుకోవడం వల్ల భారత్‌కు పైచేయి లభిస్తుందని తెలిపారు. సి-130జెకి సంబంధించిన కొన్ని భాగాలను టాటా సంస్థతో కలిసి లాక్‌హీడ్ మార్టిన్.. హైదరాబాద్‌లో ఉత్పత్తి చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ