
ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది (Dense fog). అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఎదురవడంతో వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ (IMD issues red alert) చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి వాతావరణం దారుణంగా మారడంతో రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కప్పేసిందని, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి.
సోమవారం తెల్లవారుజామున దిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ (AQI) 403గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించింది. వివేక్ విహార్ (460), ఆనంద్ విహార్ (459), రోహిణి (445), వజీర్‌పూర్ (444) ఏక్యూఐలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ