

ఢిల్లీ.29, డిసెంబర్ (హి.స.) మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది. శరద్ పవార్-అజిత్ పవార్ (Sharad Pawar-Ajit Pawar) నాయకత్వాల్లోని ఎన్‌సీపీ (ఎస్పీ)-ఎన్‌సీపీ పార్టీలు పింప్రీ-చించ్వాడ్ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు.
మహారాష్ట్ర (Maharashtra)లో జనవరి 15న స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లా కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఒకేవిడతలో ఓటింగ్ జరగనుంది (Mumbai civic body polls). ఈ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు జరిగిన చర్చల్లో భాగంగా కలిసి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని పింప్రీ-చించ్వాడ్ ర్యాలీలో అజిత్ వెల్లడించారు. ‘‘ఈ పరిణామాలపై ప్రజల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అయితే మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంటుంది. సీట్ల సర్దుబాటు జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. పార్టీ కార్యకర్తలు ప్రచారంపై దృష్టిపెట్టాలి. వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలి’’ అని మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ