
ఢిల్లీ, 29 డిసెంబర్ (హి.స.)
2017లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ మైనర్ బాలిక అత్యాచార కేసు (Unnao minor girl rape case) మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ కేసులో దోషిగా తేలిన బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్ (Kuldeep Singh Sengar)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సెంగార్‌కు విధించిన జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ (Suspension of Sentence) ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court)స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, ఈ కేసులో సెంగార్ శిక్ష యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో సెంగార్‌కు లభించిన స్వల్ప ఉపశమనం ముగిసి, మళ్ళీ కఠిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ విచారణ సందర్భంగా సీబీఐ తన వాదనలను బలంగా వినిపిస్తూ, సెంగార్ వంటి పలుకుబడి ఉన్న వ్యక్తికి శిక్షా కాలంలో ఉపశమనం కలిగించడం బాధితురాలి భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. ఈ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. అత్యాచార కేసులో జీవిత ఖైదు తో పాటు, బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా సెంగార్ 10 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్నాడు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో బాధితురాలి కుటుంబానికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించినట్లయింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV