
ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) : దేశ రాజధాని ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు కమ్మేయగా, మరోవైపు వణికించే చలి అందరినీ విలవిలలాడేలా చేస్తోంది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించింది. ఫలితంగా జనజీవనం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు శీతల గాలుల హెచ్చరికను జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.
ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (Visibility) భారీగా పడిపోయింది. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో సుమారు 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ కూడా సుమారు 100కి పైగా రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ తదితర ప్రాంతాల్లో దృశ్యమానత కేవలం 50 మీటర్లకు పడిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ