
ఢిల్లీ.30, డిసెంబర్ (హి.స.) ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున అల్మోరా జిల్లాలోని శిలాపానీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది (Uttarakhand Bus Accident). ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన లోయ ప్రదేశం ఇబ్బందికరంగా ఉండడం, వాహనం కింద బురద పేరుకుపోవడంతో అందులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడం కష్టంగా మారిందన్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. బస్సు ద్వారహత్ మీదుగా రాంనగర్‌కు వెళ్తుండగా అదుపుతప్పి లోయలో పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ