
నిజామాబాద్, 31 డిసెంబర్ (హి.స.)
బాన్సువాడ నియోజకవర్గంలోని
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నూతనంగా ఎన్నుకున్న సర్పంచులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.
అలాగే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సహకరించి ఇసుక ఇప్పించి నిర్మాణం చేసేలా ప్రోత్సహించాలని, బిల్లులు సమయానికి వచ్చేటట్లు చూడాలని అన్నారు. తమకు ఉన్నంతలోనే ఆడబిడ్డ పెళ్ళి చేసుకోవాలని, ఆడంబరాలకు పోయి అప్పులపాలు కాకూడదని, అప్పుచేసి ఉన్న పొలాలు, ఇళ్లను అమ్ముకోవద్దని పోచారం సూచించారు. తన నియోజకవర్గంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదని ప్రతి ఒక్కరికి స్వంత ఇంటి కళ పూర్తి చేయడం తన కర్తవ్యం అని, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు