
రంగారెడ్డి, 31 డిసెంబర్ (హి.స.)
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. శంషాబాద్ మండల పరిధిలోని మదనపల్లిలో సర్వేనెంబర్ 50లో వెలసిన అక్రమ నిర్మాణాలను తహసిల్దార్ రవీందర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేతలు చేపట్టారు. సర్వేనెంబర్ 50లో మొత్తం అసైన్డ్ భూమి ఉంది. అయితే కొంతకాలంగా అక్రమార్కులు సుమారు 10 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకొని వివిధ నిర్మాణాలతో పాటు ఫ్రీ క్యాస్ట్ గోడలు నిర్మించారు. ఈ మేరకు స్పందించిన శంషాబాద్ తహసీల్దార్ చర్యలకు ఉపక్రమించారు. ఆయన ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకొని జెసిబిల సాయంతో కూల్చివేతలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సర్కారు భూముల జోలికి వస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఎంతటి వారున్నా ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు