
ఢిల్లీ, 31 డిసెంబర్ (హి.స.)
శీతాకాలం తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు (Dense fog) కమ్మేసింది. దీంతో అనేక రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. బుధవారం ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు విడవకపోవడంతో విజిబిలిటీ (దృశ్యమానత) పూర్తిగా పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport)లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 148 విమానాలను రద్దు చేయగా, మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పలు విమానాలను సమీపంలోని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే కాలుష్యం (Pollution) కారణంగా సతమతం అవుతున్న ఢిల్లీ ప్రజలు.. ఈ పొగమంచుతో పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. దీంతో నగరంలో గాలి నాణ్యత సూచీ (AQI) 400 పాయింట్లకు పడిపోవడంతో గాలి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. పొగమంచు కారణంగా రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV