
ఢిల్లీ 08 డిసెంబర్ (హి.స.) ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదికైంది. లోక్‌సభలో సోమవారం ప్రధాని మోదీ ఆ చర్చను ప్రారంభించారు. మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. విపక్ష కాంగ్రెస్ తరఫున ‘వందేమాతరం’ (Vande Mataram)పై లోక్‌సభలో పార్టీ ఉప నేత గౌరవ్ గొగొయ్, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు మాట్లాడనున్నారు. .
వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పాట 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందేమాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం దేశానికి స్ఫూర్తినిచ్చి.. సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనే చేపట్టినట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ