
హైదరాబాద్, 24 మే (హి.స. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న పలు హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమీషనర్ ఆదేశాల మేరకు వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం పలు ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ షోకాజు నోటీసులు, కిచెన్ సీజ్ తో పాటు జరిమానాలు విధించారు.
ఈ టీమ్ శుక్రవారం నాడు 58 హాస్టళ్లను తనిఖీ చేసి 30 హాస్టళ్లకు నోటీసులు జారీ చేసి, 8 హాస్టల్ కిచెన్ లను సీజ్ చేశారు. అంతేకాకుండా సుమారు 2.45 లక్షల రూపాయల జరిమానా విధించారు. హాస్టల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం మూలంగా ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో జిహెచ్ఎంసి కమీషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ ద్వారా నగరంలోని హాస్టళ్లలో తనిఖీలు చేయించారు.
హాస్టళ్ల ఆకస్మిక తనిఖీలకు కొనసాగింపుగా 24.05.2025 శనివారం ఎల్బీనగర్ జోన్‌లోని శ్రీనగర్ కాలనీ, లలిత నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం, కూకట్‌పల్లి జోన్‌లోని KPHB, మూసాపేట్ ప్రాంతాలు, శేరిలింగంపల్లి జోన్‌లోని వినాయక్ నగర్, పత్రికా నగర్‌లలో ఈ డ్రైవ్ నిర్వహించారు. 60 హాస్టళ్లను తనిఖీ చేసి 38 హాస్టల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 07 హాస్టల్ కిచెన్ లను మూసివేశారు. జీహెచ్ఎంసి చట్టం, 1955 నిబంధనల ప్రకారం బృందాలు రూ.2,46,000/- జరిమానా విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు