
అమరావతి, 25 మే (హి.స.)
ప్రభుత్వాసుపత్రుల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు గతంలో ఎన్టీఆర్ బేబీ కిట్లు అందజేసేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. వచ్చే నెల నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 39 పీహెచ్‌సీలు, 24 యుపీహెచ్‌సీలు, 7 సీహెచ్‌సీలు, నరసరావుపేటలో ప్రాంతీయ వైద్యశాల ఉన్నాయి. వీటిలో ఏటా 8-9 వేల వరకు ప్రసవాలు జరుగుతాయి. ఎన్టీఆర్ బేబీ కిట్ల పునరుద్ధరణతో నవజాత శిశువులకు ప్రయోజనం చేకూరనుంది. అప్పటి తెదేపా ప్రభుత్వం 2016 జులైలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ఈ పథకాన్ని డాక్టర్ వైఎస్‌ఆర్ బేబీ కిట్లుగా పేరు మార్చి ఓ ఏడాది పాటు అందజేసి నిలిపేసింది. నాలుగేళ్లుగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేసుకున్న సుమారు 25 వేల మంది మహిళలు ఈ పథకానికి దూరమయ్యారు. సుమారు రూ.3.50 కోట్ల లబ్ధి కోల్పోయారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నారు. శిశు మరణాల రేటు తగ్గించడంతో పాటు తల్లుల ఆర్థిక భారం తగ్గించడం వల్ల ప్రయోజనం చేకూరనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ