
అమరావతి, 31 మే (హి.స.) జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో ఆసనాలు వేయించడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. యోగాంధ్ర-2025, యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కనీసం 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ సుమారు 26 కిలోమీటర్ల పొడవున నిర్వహించే కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొని, ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించేలా, సమీప భవిష్యత్తులో ఎవరూ ఆ రికార్డును అధిగమించలేని రీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నోడల్ అధికారి కృష్ణబాబు జూన్ 16 నుంచి విశాఖ కమాండ్ కంట్రోల్ కేంద్రంగా పని చేస్తారన్నారు. సమావేశంలో డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా వర్చువల్‌గా పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ