
హైదరాబాద్, 17 జూన్ (హి.స.) ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 125 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు ఆసుపత్రి అధికారులు తాజాగా వెల్లడించారు. అందులో 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది.
72 గంటల్లో పూర్తవుతుందని చెప్పిన డీఎన్ఏ పరీక్ష 84 గంటలైనా పూర్తి కాకపోవడంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖాన వద్ద పడిగాపులు పడాల్సి వస్తున్నది. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..