
హైదరాబాద్: , 19 జూన్ (హి.స.)ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజం పడింది. ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేం రాజీ పడం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయమై బుధవారం అఖిలపక్ష ఎంపీలతో నిర్వహించిన భేటీ అనంతరం.. సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎవరినైనా కలుస్తాం. ఎవరితోనైనా కొట్లాడతాం. సామదాన భేద దండోపాయాల్లో మొదటి అంకంలో ఉన్నాం. గురువారం కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమవుతాం. అవసరమైతే ప్రధానినీ కలుస్తాం. అయినా ఫలితం లేకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం.
అక్కడా కాకపోతే రాజకీయ పోరాటం చేస్తాం. ’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన పాపంలో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు సమస్య కూడా వచ్చింది’’ అంటూ నిప్పులు చెరిగారు. ‘‘గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అడ్డు పడుతోంది. గోదావరిలో 1,000, కృష్ణా నదిలో 500 మొత్తం 1,500 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇస్తే.. ఆ రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోం’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ