
హైదరాబాద్, 24 జూన్ (హి.స.)
తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబురం బోనాల పండుగను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జంట నగరాల పరిధిలోని వివిధ ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రులు, ముఖ్య నేతల వివరాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ వెల్లడించింది.
వచ్చే నెల 13న సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
ఆగస్టు 20న లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు అందజేస్తారు. నాచారంలోని మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్వన్లోని దర్బార్ మైసమ్మ ఆలయానికి మంత్రి దామోదర రాజనర్సింహ, చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చిలకలగూడలోని కట్ట మైసమ్మ ఆలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫుప పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఆగస్టు 1న బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్