హైదరాబాద్, 28 జూన్ (హి.స.) ఫిర్యాదు చేసిన 3 గంటల్లోనే స్పందించిన హైడ్రా, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం కు చెందిన పార్కును కాపాడింది. 1200 గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేసారని స్థానికులు నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలసి ఫిర్యాదు చేసారు. స్పందించిన కమిషనర్ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కి ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలసి హైడ్రా రంగంలోకి దిగి పార్కులోని ఆక్రమణలను తొలగించడంతోపాటు, పార్కు చుట్టూ ప్రహరీని కూడా నిర్మించింది. శనివారం ఉదయం వేకువ జామునే పార్కులోకి వచ్చిన నివాసితులు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా (Park Protected by Hydra) బోర్డును చూసి మురిసిపోయారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్