తెలంగాణ, జోగులాంబ గద్వాల 29 జూన్ (హి.స.) గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులు బయటకు వెళ్తుండగా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 25,691 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 1,42,830 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది.
కాగా, జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.190 మీటర్ల వద్ద ఉన్నది. మొత్తం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను ఇప్పుడు 7.079 టీఎంసీలు ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు