పఠాన్చెరు పాశ మైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం.. పదిమంది కార్మికుల మృతి
సంగారెడ్డి, 30 జూన్ (హి.స.) సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేటి ఉదయం 9:30 ప్రాంతంలో ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ నందు సోమవారం ఉద
పాశమైలారం


సంగారెడ్డి, 30 జూన్ (హి.స.)

సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేటి ఉదయం 9:30 ప్రాంతంలో ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ నందు సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో 10 మంది కార్మికులు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఐదుగురు మరణించగా, దవాఖానలో మరో ఐదుగురు చనిపోయినట్టు కడపటి సమాచారం. ఈ ప్రమాదంలో మరో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. పూర్తి సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 8 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమించాయి. శిథిలాల తొలగింపునకు భారీ క్రేన్లు, హైడ్రా మిషన్లను రంగంలోకి దించారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోవడంతో సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ప్రాణాపాయంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ భవనం నుంచి కేవలం ఆరుగురినే బయటకు తీయగలిగారు.

కెమికల్ ఫ్యాక్టరీలో మంటలతో పాటు భారీగా విషవాయువులు విడుదలవడంతో పరిసర ప్రాంతాల్లో ఘాటైన వాసనలు వ్యాపించాయి. స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతూ తమ ఇళ్లలోకి చెదురుమదురుగా చేరుకుంటున్నారు. అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఈ పేలుడు ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్నదానిపై విచారణ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు తర్వాత అసలు ప్రమాద స్థాయి ఎంత పెద్దదో అర్థం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande