
అమరావతి, 4 జూన్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. రోళ్లు పగిలే ఎండలు కాస్తాయని భయపడే రోహిణి కార్తెలో వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈ యేడు ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాల రాకతో అటు ఏపీ, ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశారు. ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి భారీ వర్షాలు కురవడంతో ఇక ఎండాకాలం అయిపోయినట్టే అనుకున్నారు ప్రజలంతా. కానీ, అప్పుడే పూర్తవలేదన్నట్టుగా గత నాలుగైదు రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రెండ్రోజులుగా తెలంగాణతో పాటుగా కోస్తాంధ్రతీరంలో ఉన్న జిల్లాల్లో ఎండలు ఇరగకాస్తున్నాయి. ఉక్కపోత కూడా పెరగడంతో.. ప్రజలు అల్లాడుతున్నారు. నైరుతి మందగమనంతోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి వేడి పొడిగాలులు మొదలవ్వడంతో పాటు ఎండల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీలో రుతుపవనాల మందగమనం కనిపిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేసవి పరిస్థితులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అరేబియా సముద్రం, బంగాళాకాతంలో రుతుపవన కరెంట్ (కదలిక) బలహీనంగా ఉండడంతో అనేక ప్రాంతాల్లో తిరిగి వేసవి పరిస్థితులు ఏర్పడ్డాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి