తెలంగాణ, 8 జూన్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గంలో షాక్ తగిలింది. దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. పార్టీని అంటిపెట్టుకుని ఉండి, ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి ప్రతిచోట అవమానం జరిగిందని పేర్కొన్నారు.
పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో మనమే గెలవబోతున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు