వాషింగ్టన్ డిసి, 1 జూలై (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. చరిత్రలోనే ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో మస్క్ ప్రభుత్వ సబ్సిడీలు పొందారని, అవి లేకపోతే ఆయన తన వ్యాపారాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ బిల్లును ఆమోదిస్తే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఎలాన్ మస్క్ హెచ్చరించడంతో అమెరికా రాజకీయాల్లో ఈ వివాదం పెను దుమారం రేపుతోంది.
మస్క్‌పై విరుచుకుపడ్డ ట్రంప్
ట్రంప్ ప్రతిపాదించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై మస్క్ తన విమర్శలను తీవ్రతరం చేయడంతో అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందిస్తూ... చరిత్రలో ఏ వ్యక్తికి దక్కనంత స్థాయిలో ఎలాన్ మస్క్ సబ్సిడీలు పొంది ఉండవచ్చు. ఆ సబ్సిడీలు లేకపోతే, బహుశా ఎలాన్ తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాలోని తన ఇంటికి తిరిగి వెళ్లవలసి ఉంటుంది.
ఇక రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు. దీనివల్ల మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. బహుశా మస్క్ ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులపై డోజ్ (DOGE) నిశితంగా దృష్టి పెట్టాలేమో? దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు! అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి