దిల్లీ: , 14 జూలై (హి.స.)దేశవ్యాప్తంగా రైలింజిన్లు, రైలుపెట్టెల్లో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దాదాపు 15,000 లోకోమోటివ్‌లు (రైలింజిన్లు), 74,000 బోగీల్లో 3.86 లక్షల సంఖ్యలో వీటిని అమర్చనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొంది. తక్కువ వెలుగులోనూ, రైలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలోనూ అత్యంత నాణ్యమైన దృశ్యాలు చిత్రీకరించేలా ఇవి పనిచేస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఇంజిన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్, సహాయమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ సమీక్షించారు. ఉత్తర రైల్వే పరిధిలో ఇప్పటివరకు ఏర్పాటుచేసిన కెమెరాల వివరాలను ఈ సందర్భంగా అధికారులు వారిదృష్టికి తీసుకెళ్లారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని కోచ్‌లు, లోకోల్లో కెమెరాల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. ప్రతి కోచ్‌లో నాలుగు ప్రవేశద్వారాల్లో కెమెరాలు ఏర్పాటుచేస్తారు. ఇంజిన్లలో ఆరు కెమెరాల్లో నాలుగింటిని ముందు, వెనుక వైపు అటూఇటూ అమర్చుతారు. మిగిలిన రెండూ.. లోపలవైపు వెనుక, ముందు భాగాన ఉంటాయి. వీటినుంచి డేటాను విశ్లేషించేటప్పుడు కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించుకోవాలని రైల్వేమంత్రి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ