న్యూఢిల్లీ, 21 జూలై (హి.స.)
భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో పహల్గాం టెర్రర్ ఎటాక్ విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, టెర్రరిస్టులను అరెస్ట్ చేయకపోవడంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అదేవిధంగా పహల్గాం టెర్రర్ అటాక్ పై ప్రధాని మోడీ జవాబు చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో మొదట 12 గంటల వరకు .. ఆ తర్వాత 2 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. అనంతరం రెండు గంటలకు సభ ప్రారంభం అయిన కొద్ది సేపటికే ప్రతిపక్షాలు సభకు అడ్డుపడటంతో స్పీకర్ సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రారంభం అయిన మొదటి రోజే సభ వరుసగా మూడుసార్లు వాయిదా పడడం జరిగింది. మరో పక్క రాజ్య సభలోను ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది. లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోను పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వం వివాదంపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..