తిరువనంతపురం, 22 జూలై (హి.స.)
బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూపర్ ఫైటర్ జెట్ ఎఫ్-35 (F-35B Fighter) ఎట్టకేలకు కేరళను వీడింది. ఈ విమానం హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో జూన్ 14వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. దాంతో సుమారు ఐదు వారాలుగా అది భారత్‌లోనే ఉండిపోయింది. తాజాగా తిరువనంతపురం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది (F-35 fighter jet Leaves Kerala).
ఈ ఫైటర్ జెట్ ఆస్ట్రేలియా దిశగా ప్రయాణిస్తూ.. భారత్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో పైలెట్ ఇంధన సమస్యను, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో సమీపంలోని కేరళలో తిరువనంతపురంలో విమానాన్ని దించాల్సి వచ్చింది. గత నెల రోజుల్లో పలుమార్లు దీని హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు యత్నించారు. కొన్ని రోజుల క్రితం మరమ్మతుల నిమిత్తం బ్రిటన్ నిపుణుల బృందం భారత్‌కు వచ్చింది. లోపాలు సవరించడంతో ఆ విమానం గగనతలంలో ఎగిరేందుకు నిన్న వారు అనుమతిచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు