దిల్లీ: , 24 జూలై (హి.స.)బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar SIR)పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) స్పందించింది. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థించుకుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘మన దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం తల్లి లాంటిది. దానికి అనుగుణంగానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాం. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశాం. విమర్శలు, వివాదాలకు భయపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేం ఎలా పనిచేయగలం? చనిపోయిన ఓటర్ల పేరుతో నకిలీ ఓట్లను ఎలా అనుమతిస్తాం? శాశ్వతంగా వలస వచ్చిన వారు, రెండు ప్రాంతాల్లో ఓటు రిజిస్టర్ చేసుకున్న వారు, విదేశీయులతో ఎలా ఓటు వేయిస్తాం? పారదర్శక పనితీరు కోసం ప్రక్షాళన చేయకూడదా? రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా దేశ పౌరులంతా ఈ ప్రశ్నలపై పునరాలోచన చేయాలి’’ అని సీఈసీ తన ప్రకటనలో సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ