డిల్లీ, 24 జూలై (హి.స.)ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి చెందిన కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ, ముంబయిలోని ప్రాంగణాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయన్న ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే, అనిల్‌కు చెందిన వ్యక్తిగత నివాసానికి మాత్రం ఈడీ అధికారులు వెళ్లలేదని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దిల్లీ, ముంబయి నుంచి వచ్చిన దర్యాప్తు సంస్థ బృందాలు 35 ప్రదేశాల్లో ఈ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటివరకు 25 మందిని ప్రశ్నించారు.
ఈడీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. 2017 నుంచి 2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అనిల్ అంబానీ కంపెనీలు అనుమానాస్పద రీతిలో దారి మళ్లించాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇదే అంశంలో యెస్ బ్యాంక్ (Yes Bank) మాజీ ఎండీ ప్రమోటర్ రాణా కపూర్‌పై దాఖలైన మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అనిల్ అంబానీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఈడీ తన ప్రాథమిక దర్యాప్తు పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు