దిల్లీ:25 జూలై (హి.స.)
దేశ ప్రధానిగా మోడీ (74) సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను మోడీ సొంతం చేసుకున్నారు. శుక్రవారంతో 4,078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. 4,077 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా గాంధీ రికార్డును మోడీ అధిగమించారు. వరుసగా ఇన్ని రోజులు ఏకధాటిగా పని చేసిన కాంగ్రెసేతర ప్రధానుల్లో మోడీనే ఆ రికార్డ్ సొంతం చేసుకున్నారు. జూలై 25, 2025న మోడీ వరుసగా 4,078 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.
1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులుగా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పాలించారు. ఇప్పటి వరకు ఆ రికార్డ్‌ను ఎవరు అధిగమించలేదు. తొలిసారి కాంగ్రెసేతర నేత ఆ రికార్డ్‌ను అధిగమించారు. అది కేవలం మోడీకి మాత్రమే సొంతం అయింది. రెండు సార్లు పూర్తి మెజార్టీతో మోడీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాదిలో జరిగిన ఎన్నికల్లో మిత్ర పక్షాల మద్దతుతో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1971లో ఇందిరాగాంధీ తర్వాత పూర్తి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధాని మోడీనే కావడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ