న్యూఢిల్లీ,26 జూలై (హి.స.) భారతదేశంలో 18-45 వయసువారిలో ఆకస్మిక మరణ ప్రమాదం కొవిడ్ టీకాల వల్ల పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం ఈ సంగతి నిగ్గుదేల్చిందని వివరించారు. కొవిడ్ వల్ల ఆస్పత్రిపాలవడం, కుటుంబంలో ఆకస్మిక మరణాలకు గురైన చరిత్ర ఉండటం, మరణానికి 48 గంటల ముందు అతిగా తాగడం లేదా అతిగా వ్యాయామం చేయడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటివి జరిగితే ఆకస్మిక మరణ ముప్పు పెరుగుతుందని తేలింది. 2023 మే-ఆగస్టులో 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 47 ఆస్పత్రులలో ఐసీఎంఆర్-జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థ (ఎన్‌ఐఈ) అధ్యయనం జరిపాయి. రెండు డోసుల కొవిడ్ టీకాలు తీసుకుంటే ఆకస్మిక మరణ ప్రమాదం తగ్గుతుందని తేలినట్లు నడ్డా తెలిపారు. ఐసీఎంఆర్, ఎయిమ్స్ అధ్యయనం కూడా ఇదే సంగతి నిర్ధారించిందని చెప్పారు.
:
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ