న్యూఢిల్లీ,26 జూలై (హి.స.)
దిల్లీ: ఆపరేషన్ సిందూర్ సహా భవిష్యత్తు సైనిక సన్నద్ధతపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని... మన జవాన్లు ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. శుక్రవారం ఇక్కడి సుబ్రోతో పార్కులో జరిగిన ఓ రక్షణ సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...భవిష్యత్తులో యుద్ధ గతి మారుతుందన్నారు. ఇందుకోసం ‘సమాచారం, సాంకేతికత, మేధస్సు’ వంటి మూడు నైపుణ్యాల కలబోతగా భవిష్యత్తు సైనికులు రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సీడీఎస్ అన్నారు. యుద్ధాల్లో రన్నరప్‌లు ఉండరని.. అందుకే సైన్యాలు అప్రమత్తంగా ఉంటూ ఏ క్షణమైనా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘‘దీనికి ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ. మనం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి. 365 రోజులు...24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి. యుద్ధ విధానాలపై మాత్రమే కాదు సాంకేతికత, సమాచారం వంటి విషయాలపైనా పూర్తి అవగాహన కలిగిఉండాలి’’ అని చౌహాన్ వ్యాఖ్యానించారు.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ