దిల్లీ: 30 జూలై (హి.స.)అనుభజ్ఞుల నియామకాలు నిలిపివేయాలని, ప్రస్తుత సిబ్బందికి వార్షిక వేతన పెంపును వాయిదా వేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిర్ణయించిందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా తమ సంస్థలో పని చేస్తున్న మొత్తం 6 లక్షల మందికి పైగా ఉద్యోగుల్లో 2 శాతానికి సమానమైన 12,000 మందికి పైగా తొలగించనున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి విదితమే. దీనితో పాటు ఈ నిర్ణయాలు తీసుకుందని సమాచారం. కృత్రిమ మేధ (ఏఐ), ఇతర అధునాతన సాంకేతికతలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని.. క్లయింట్ల ప్రాజెక్టులకు అనుగుణంగా వారిని కేటాయిస్తున్నామని టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ ఇటీవల తెలిపారు. హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్‌కతా కార్యాలయాల్లో దీర్ఘకాలంగా ప్రాజెక్టుల్లో లేని ఉద్యోగులను సంస్థ తొలగిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ