దిల్లీ: 30 జూలై (హి.స.)
రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం (Earthquake in Russia) సంభవించింది. దీంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
‘‘సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి’’ అని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ