బెంగళూరు- 30 జూలై (హి.స.) అల్‌ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ వెనక కీలక కుట్రదారు 30 ఏళ్ల షామా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలిపారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతిస్తున్నవారిని గుర్తించడానికి అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటక నుంచి ఆమె ఉగ్రవాదులకు సహాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు.
జులై 23న ఈ మాడ్యుల్ (Al Qaeda)తో సంబంధమున్న మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ, మహమ్మద్ ఫైక్ అనే నలుగురు ఉగ్ర అనుమానితులను గుజరాత్, దిల్లీ, నోయిడాలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరంతా సోషల్ మీడియాలోని ఓ రహస్య, ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారని.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ గ్రూప్ సభ్యులు ఉన్నారని తెలిపారు. వారందరికీ షామా పర్వీన్ నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ