హైదరాబాద్, 4 జూలై (హి.స.)
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు అన్నారు. శుక్రవారం సీ ఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు వసతి, భోజనం ఏర్పాట్లతో పాటు గుర్తించిన మృతదేహాలను తరలించే ఏర్పాట్లపై గురించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్ లను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో దర్యాప్తు చేశారు. మిస్సింగ్ కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. ఆచూకీ లేని 9 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు ఉధృతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించి టెక్నికల్ కమిటీ తో పాటు హై లెవెల్ కమిటీ విచారణ షురూ చేసిందని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. పూర్తి నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్