తెలంగాణ, వరంగల్. 4 జూలై (హి.స.) పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందచేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు మాట్లాడుతూ.. ఐదు నెలలుగా తనకు మధ్యాహ్నం భోజనం వంట బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనం పెడుతూ తమ పిల్లలను పస్తులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఈవో ఆఫీసుకు వెళ్లితే బిల్లులు చేస్తామంటూ దాట వేస్తున్నారే తప్పా పనులు చేయడం లేదన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన కూడా బిల్లులు సకాలంలో చెల్లించడంలో విద్యా శాఖ పూర్తిగా విఫలమైందన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు, 9, 10 వ తరగతులకు కలిపి ఒకే సారి ఎగ్ బిల్లులు, వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.5వేలకు పెంచాలన్నారు. అలాగే కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు