దిల్లీ , 4 జూలై (హి.స.)ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago)కు చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్- బిస్సేర్‌తో సహా 38 మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఈసందర్భంగా అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ దేశంలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రధానమంత్రి కమ్లాను బిహార్‌కు ముద్దుబిడ్డగా మోదీ పేర్కొన్నారు. కమ్లా పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని తెలిపారు. అక్కడి ప్రజలు ఆమెను బిహార్ కుమార్తెగా భావిస్తారన్నారు. ఆ రాష్ర్ట వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. శతాబ్దాలుగా వివిధ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. ట్రినిడాడ్‌లోని పలు వీధులకు బనారస్, పట్నా, కోల్‌కతా, దిల్లీ వంటి పేర్లు ఉన్నాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ