తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 4 జూలై (హి.స.)
ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం వారు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిర్ణీత స్థలంలో ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. విడతల వారిగా మొత్తం రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
గంభీరావుపేట మండలం గోరంటాలలో లోతు వాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లోతు వాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి సర్వే చేయాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు