హైదరాబాద్, 4 జూలై (హి.స.) నిరుద్యోగుల సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
ఏర్పాటు చేశారు. సచివాలయం ఎంట్రీ గేట్ వద్ద ఎవ్వరినీ రానివ్వకుండా ఉండేందుకు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముట్టడి నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు రాత్రి నుంచే భారీగా నిరుద్యోగుల ముందస్తు అరెస్ట్లు కొనసాగినట్లు సమాచారం. దీంతో సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం కన్పిస్తోంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీపై ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఇటీవల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
వివిధ జిల్లాల నిరుద్యోగులు వచ్చి.. ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి ఆయన విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీశ్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి నిరుద్యోగులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సభఉన్న నేపథ్యంలో ట్యాంక్బండ్, లోయర్ ట్యాంక్ బండ్, బషీర్ బాగ్, లక్షీకపూల్, రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్