కర్నూలు, 4 జూలై (హి.స.)టమోటా.. ఈ పేరు వినని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! టమోటా సోలనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ప్రతి ఇంటి వంటింట్లో తప్పక ఉండే కూరగాయ. టమాట లేకుండా వంట సాధ్యం కాదు. అందుకే దీనిని ఎంత ధరైనా చెల్లించి ప్రతి వంటకంలో ఉపయోగిస్తుంటారు. ఇది వంటకాలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. వంటకం రుచిని పెంచుతుంది. అంతే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
టమోటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
టమోటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు గుండెకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అదనంగా అంతేకాకుండా టమాటాలో ఉండే పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది
టమోటాలలో విటమిన్ ఎ తో పాటు లుటిన్, బీటా-కెరోటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత నుంచి రక్షించడంలో సహాయపడతాయి. డిజిటల్ పరికరాలు విడుదల చేసే నీలి కాంతి నుంచి కళ్ళను రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
క్యాన్సర్ నివారణ
టమోటాలలో లభించే లైకోపీన్ క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చూపించాయి.చర్మానికి ఎంతో మంచిది
టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వాటిలో లైకోపీన్ కూడా ఉంటుంది. ఈ రెండూ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రెండు అంశాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మం లభిస్తుంది. అంతే కాదు సూర్యకాంతి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి