స్పెయిన్, 4 జూలై (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఓ అరుదైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయనలోని పరిపాలనా దక్షుడి గురించే కాకుండా, ఆయనలోని కవి గురించి కూడా ప్రపంచానికి తెలిసేలా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని వ్యవహరించారు. మోదీ రాసిన కవితలోని పంక్తులను ఆమె స్వయంగా ఉటంకించి, ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని అందించారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఓ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్-బిస్సేస్సర్ పాల్గొన్నారు. కౌవాలోని నేషనల్ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో శుక్రవారం జరిగిన ఈ సభలో ఆమె ప్రసంగిస్తూ, మోదీ రాసిన ఓ గుజరాతీ కవితలోని కొన్ని వాక్యాలను ఉటంకించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రధాని మోదీ గుజరాతీలో రచించిన 'ఆంఖ్ ఆ ధన్య ఛే' (ఈ కళ్లు ధన్యమయ్యాయి) అనే పుస్తకంలోని కవితను ఆమె ప్రస్తావించారు. గడిచిపోయిన రోజుల్లోకి మనసుతో ప్రయాణించినప్పుడు ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి. కష్టకాలంలో మనతో నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ జ్ఞాపకాలే మన ప్రయాణంలో భాగమవుతాయి అనే భావం వచ్చే కవితా పంక్తులను ఆమె సభలో వినిపించారు.
కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో దాదాపు 40 శాతం మంది భారత సంతతికి చెందినవారే. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం, ఈ దేశంలో సుమారు 5.56 లక్షల మంది భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. 1845 నుంచి 1917 మధ్య కాలంలో ఒప్పంద కార్మికులుగా భారత్ నుంచి వలస వెళ్లిన వారి వారసులే వీరిలో అధిక శాతం మంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన, ఆయన కవితను అక్కడి ప్రధాని ప్రస్తావించడం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి