దిల్లీ: 4 జూలై (హి.స.)అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తప్పించేలా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ అంగీకారం తెలిపాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, లోక్‌సభలోనా అనే విషయంపై నిర్ణయం తీసుకున్నాక ఆయా పార్టీల సభ్యుల నుంచి సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది ఎంపీలు, రాజ్యసభలో అయితే కనీసం 50 మంది సభ్యుల సంతకాలు అవసరమవుతాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి.. రాజ్యసభలో లేదా లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాక.. విచారణ జరపడానికి ఛైర్మన్ లేదా స్పీకర్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ