అమరావతి, ,: గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు గుంటూరు నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓ స్థల వివాదం విషయమై ఈ నెల 8న తన కార్యాలయంలో హాజరు కావాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అందులో పేర్కొన్నారు. కిలారు రోశయ్య తమ స్థలాన్ని కబ్జా చేశారని, 2009లో తన భర్తను కారుతోనూ ఢీకొట్టించారని గుంటూరు శారదాకాలనీకి చెందిన విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ రాజారావు భార్య గుమ్మడి భారతి పలుమార్లు పోలీసు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మిర్చియార్డు సమీపంలో 1980లో ఎకరం 23 సెంట్ల భూమిని కొనుగోలు చేశామని.. అందులో 2009 వరకు పత్తిసాగు చేశామని పేర్కొన్నారు. రోశయ్య ఆ పొలాన్ని తనకు విక్రయించాలంటూ ఇబ్బంది పెట్టడంతో పాటు.. ఒప్పుకోలేదని తన భర్తను కారుతో ఢీకొట్టించారని ఆమె ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఆ స్థలంలో అక్రమ కట్టడాలు చేస్తున్నారంటూ గుమ్మడి భారతి బంధువు ఉప్పలపాటి మునెయ్య మూడు రోజుల క్రితం కమిషనర్‌తో పాటు పట్టణ ప్రణాళిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనులు నిలిపివేయించారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ నెల 8న ఉదయం 11 గంటలకు గుంటూరు కార్పొరేషన్‌లోని తన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని.. గుమ్మడి భారతి, కిలారి రోశయ్యలకు కమిషనర్ పులి శ్రీనివాసులు తాఖీదులు పంపారు. 2019లో వైకాపా తరఫున పొన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోశయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ