హైదరాబాద్, 8 జూలై (హి.స.)
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మీద ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బంజారాహిల్స్ వద్ద కాంగ్రెస్ నేతలు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
వచ్చే వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన వారిని, వ్యవసాయంపై రీసెర్చ్ చేస్తున్న వారిని, ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ రంగానికి దోహదపడుతున్న వారిని గుర్తించి వైఎస్ఆర్ పేరుమీద అవార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ ను నిత్యం స్మరిస్తూ.. వారి ఆలోచనను ముందుకు తీసుకువెళతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అంటే మొదట గుర్తుకువచ్చేది వ్యవసాయం.. ప్రాజెక్టులేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..